హైదరాబాద్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

  • విజయవంతంగా ముగిసిన చంద్రబాబు దుబాయ్ పర్యటన
  • 25 కీలక సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • గల్ఫ్ ప్రవాసాంధ్రులు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్న సీఎం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దుబాయ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనను పూర్తి చేసుకుని ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆయనకు పార్టీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈ మంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలతో కలిపి మొత్తం 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరులు, నూతన ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సీఎం వారికి వివరించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ఇదే క్రమంలో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనాల్సిందిగా పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆయన సాదరంగా ఆహ్వానించారు.

మీ నమ్మకాన్ని మర్చిపోలేను: ప్రవాసాంధ్రులతో సీఎం
పర్యటనలో భాగంగా దుబాయ్‌లో గల్ఫ్ దేశాల ప్రవాసాంధ్రులతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "నేను 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా, కానీ ఈసారి తెలుగు ప్రజల్లో చూస్తున్న ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి గెలవాలని మీరు సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేశారు. మీరు మాపై చూపించిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేను" అని ఉద్ఘాటించారు.

గతంలో తాను ప్రవాసాంధ్రులను గ్లోబల్ సిటిజెన్స్‌గా ఉండాలని కోరుకుంటే, ఇప్పుడు వారంతా గ్లోబల్ లీడర్స్‌గా ఎదుగుతుండటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతంలో తన కృషితో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చిందని, ఇప్పుడు అదే తరహాలో విశాఖపట్నానికి గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


More Telugu News