గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శర్వా... ఫొటోలు ఇవిగో!

  • కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న శర్వానంద్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షర్ట్ లెస్ ఫొటో 
  • ఫిట్‌గా మారిపోయిన శర్వా రూపం
యువత, కుటుంబ ప్రేక్షకులను అలరించే పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్ ఇప్పుడు పూర్తిగా కొత్త లుక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. తన తదుపరి చిత్రం ‘బైకర్’ కోసం ఆయన చేసిన శారీరక మార్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో శర్వా స్పోర్ట్స్ బైక్‌పై రేస్ ట్రాక్‌లో దూసుకెళ్తున్న రేసర్‌గా కనిపించారు. టైటిల్‌కి తగ్గట్లే యాక్షన్ స్పోర్ట్స్ వాతావరణం నిండిన పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఇక ఇటీవల ఆయన షర్ట్‌లెస్‌ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని విధంగా సన్నగా, ఫిట్‌గా మారిపోయిన శర్వా రూపం చూసి అభిమానులు “ఇది నిజంగానే శర్వానందేనా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజమైన రేసర్‌లా కనిపించేందుకు ఆయన బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందు కోసం కొన్ని నెలల పాటు కఠినమైన వర్కవుట్స్‌, నియంత్రిత ఆహారం పాటించినట్లు తెలుస్తోంది.

ఇక ‘బైకర్’ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో శర్వాకు జోడీగా మాళవిక నాయర్, కీలక పాత్రల్లో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి నటిస్తున్నారు. చిత్ర వర్గాల ప్రకారం.. “ఇది 1990–2000ల కాలం నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. రేసింగ్, కలలు, కుటుంబ భావోద్వేగాలను మేళవించి రూపొందిస్తున్నాం” అని తెలిపారు.

హాలీవుడ్, బాలీవుడ్ స్థాయి రేసింగ్ సన్నివేశాలతో పాటు, శర్వా నటన, కొత్త లుక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, “శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ టాప్ లెవెల్‌లో ఉంది” అంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


More Telugu News