స్టాలిన్ బాబు నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయాడని తెలిసింది: సీపీఐ నారాయణ

  • గుంటూరు కమ్యూనిస్టు నేత స్టాలిన్ బాబు కన్నుమూత
  • ఆయన మృతిపై సీపీఐ జాతీయ నేత నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి
  • తనకు రాజకీయ మార్గదర్శి స్టాలిన్ బాబేనని వెల్లడి
  • ముడిసరుకులాంటి తనను నాయకుడిగా తీర్చిదిద్దారని వ్యాఖ్య
  • ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున రాలేకపోతున్నానని ఆవేదన
  • స్టాలిన్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
గుంటూరుకు చెందిన కమ్యూనిస్టు సీనియర్ నేత స్టాలిన్ బాబు శుక్రవారం కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలిసి సీపీఐ అగ్రనేత కె. నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పి, ఉన్నత స్థాయికి చేర్చిన మార్గదర్శి స్టాలిన్ బాబేనని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తాను ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉండలేకపోతున్నందుకు ఆవేదన చెందారు.

ఈ సందర్భంగా నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. "నాకు రాజకీయ బాటచూపిన మార్గదర్శకులు స్వర్గీయ స్టాలిన్ బాబు మనల్నందరినీ వదిలి నిర్దాక్షిణ్యంగా వెళ్లి పోయారని తెలిసి ఎంతో వేదన చెందాను. ఇలాంటి సమయంలో నేను వారి కుటుంబంతో ఉండాల్సింది. కానీ పిల్లలతో ఉండాలని అమెరికా వచ్చాను" అని తెలిపారు. ఇటీవలే ఈ నెల 11, 12 తేదీలలో తాను స్టాలిన్ బాబు, ఆయన భార్య మరుద్వతి గారితో కలిసే ఉన్నానని, ఇంతలోనే ఈ వార్త వినాల్సి రావడం తనను కలచివేస్తోందని అన్నారు.

"నేను చిత్తూరు జిల్లా నుంచి చదువుకోవడానికి గుంటూరుకు వచ్చాను. అప్పటికే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడిగా పాప్యులర్ అయిన స్టాలిన్ బాబుతో నాకు పరిచయం ఏర్పడింది. రాజకీయ నేపథ్యం లేని నన్ను, చిత్తూరు జిల్లా నుంచి ముడిసరుకుగా గుంటూరు వచ్చినవాడిని ఒక తయారయిన వస్తువుగా (సీపీఐ కార్యకర్తగా) మార్చడంలో స్టాలిన్ బాబు పాత్ర గొప్పది. మా బంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు, ఒక ఆత్మీయ కుటుంబంగా మారిపోయాం" అని నారాయణ వివరించారు.

"అలాంటి రాజకీయ జన్మనిచ్చిన స్టాలిన్ బాబు ఈరోజు కన్నుమూశారు. వినడానికి బాధగా ఉన్నా, ‘పుట్టుట గిట్టుటకొరకే’ అన్న నానుడిని అధిగమించలేకపోతున్నాం" అని వ్యాఖ్యానించారు. స్టాలిన్ బాబు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఆయన భార్య మరుద్వతి గారికి, వారి పిల్లలకు తన తరఫున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని నారాయణ ఫేస్ బుక్ పోస్టులో వివరించారు.


More Telugu News