కాలిపోయిన కావేరి బస్సును లాగుతూ బోల్తాపడిన క్రేన్... డ్రైవర్ కు గాయాలు

  • కర్నూలు జిల్లాలో మరో ప్రమాదం
  • కాలిపోయిన కావేరి బస్సును తొలగిస్తుండగా ఘటన
  • అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తాపడిన భారీ క్రేన్
  • ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్‌కు గాయాలు
  • వెంటనే ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • బస్సు ప్రమాదంలో 19 మంది మృతి
కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన కావేరి బస్సు ప్రమాద స్థలంలో మరో ఘటన చోటుచేసుకుంది. కాలిపోయిన బస్సును రోడ్డు పైనుంచి తొలగిస్తుండగా, దానిని లాగుతున్న క్రేన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో క్రేన్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే, చిన్నటేకూరు వద్ద దగ్ధమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును రోడ్డు పక్కకు తరలించేందుకు అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బస్సును క్రేన్‌తో లాగుతుండగా, బరువు కారణంగా క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కకు ఒరిగిపోయి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం పోలీసులు ఘటనాస్థలి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బోల్తాపడిన క్రేన్‌ను, బస్సును అక్కడి నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గతరాత్రి కావేరి బస్సు ఒక బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ఆ ఘోర దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇప్పుడు అదే బస్సును తొలగిస్తుండగా మరో ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది.


More Telugu News