300 కోట్లు కొల్లగట్టిన 'కొత్త లోక' .. ఓటీటీ సెంటర్లో!

  • ఆగస్టులో విడుదలైన సినిమా 
  • 30 కోట్ల బడ్జెట్ తో జరిగిన నిర్మాణం 
  • 300 కోట్లకి పైగా వసూళ్లు 
  • ఈ నెల 31 నుంచి హాట్ స్టార్ లో

క్రితం ఏడాది మలయాళ ఇండస్ట్రీ వరుస సంచలనాలతో తన ప్రత్యేకతను చాటుకుంది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన సినిమాలు, రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాయి. అదే మేజిక్ ను ఈ ఏడాది కూడా కొనసాగిస్తూనే ఉందని చెప్పచ్చు. ఆ సినిమాల జాబితాలో రీసెంటుగా చేరిపోయిన సినిమానే 'కొత్తలోక'. మలయాళంలో 'లోకా చాప్టర్ 1- చంద్ర' టైటిల్ తో నిర్మితమైన ఈ సినిమాకి తెలుగు టైటిల్ గా 'కొత్త లోక'ను సెట్ చేశారు.

కల్యాణి ప్రియదర్శన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఫీమేల్ సూపర్ హీరో మూవీగా ఇది రూపొందింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. వీఎఫెక్స్ తో ముడిపడిన ఈ సినిమా కోసం 30 కోట్లు ఖర్చు చేశారు. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా, 40 రోజులలో 300 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఫలానా ఓటీటీ నుంచి ఫలానా రోజు వస్తుందంటూ కొన్ని రోజులుగా వార్తలు షికారు చేశాయి. 

చివరికి ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, నాయిక పాత్ర పేరు చంద్ర. బెంగుళూర్ కి కొత్తగా వచ్చిన ఆమె, ఒక చిన్నపాటి జాబ్ చేస్తూ ఉంటుంది. ఆమె అద్దెకి దిగిన ఎదురింట్లోనే సన్నీ ఉంటాడు. అతను ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. చంద్రకి సూపర్ పవర్స్ ఉన్నాయనే సంగతి అతనికి తెలుస్తుంది. చంద్రకి ఆ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? ఆమె గతం ఏమిటి? అనేది కథ.



More Telugu News