కర్నూలులో కాలిపోయిన కావేరీ బస్సు... రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ డీటెయిల్స్ ఇవిగో!

  • డామన్ అండ్ డయ్యూ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న బస్సు
  • అన్ని అనుమతులు కలిగి ఉన్న వేమూరీ కావేరీ ట్రావెల్స్ బస్సు
  • 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని స్లీపర్‌గా మార్చిన యాజమాన్యం
  • బస్సు ఫిట్‌గానే ఉందన్న రవాణా శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఉల్లిందకొండ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, కాలిపోయిన కావేరీ బస్సుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం, ప్రమాదానికి గురైన బస్సు తొలుత డామన్ డయ్యూ (డీడీ01ఎన్9490)లో రిజిస్టర్ చేయబడింది. ఒడిశాలోని రాయగఢ్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఆపరేటర్ వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరుతో ఆగస్టు 2018లో డామన్ డయ్యులో దీనిని రిజిస్టర్ చేశారు. యజమాని వేమూరి వినోద్ కుమార్ రాయగఢ్‌లోని సాయిలక్ష్మి నగర్ చిరునామాతో ఈ బస్సును రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.

ఆ తరువాత, ఈ వాహనం రిజిస్ట్రేషన్ రాయగఢ్ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి బదిలీ చేయబడింది. ఒడిశా రవాణా శాఖ 2025 మే 1న బేస్ టూరిస్ట్ పర్మిట్‌ను జారీ చేసింది. ఇది ఏప్రిల్ 2030 వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్టీహెచ్) నుండి ఆలిండియా టూరిస్ట్ పర్మిట్‌ను ఆగస్టు 2025లో మంజూరు చేయగా, ఇది జూలై 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

ఒడిశాలోని రాయగఢ్‌లో బస్సు ఆల్ట్రేషన్ మరియు ఫిట్‌నెస్ పూర్తయ్యాయి. ఆల్ట్రేషన్‌లో భాగంగా, రాయగఢ్ అధికారులు సీటింగ్ అనుమతులు జారీ చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు 43 సీట్ల సామర్థ్యంతో సీటింగ్ పర్మిషన్ తీసుకుని, ఆ తరువాత దానిని స్లీపర్‌గా మార్చారు.

వోల్వో మల్టీ-యాక్సెల్ స్లీపర్ కోచ్ అయిన ఈ బస్సుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. డామన్ అండ్ డయ్యులోని సిల్వస్సాలో జారీ చేసిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, 2027 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ బీమా 2026 ఏప్రిల్ 20 వరకు చెల్లుబాటులో ఉంది. అంతేకాకుండా, రహదారి పన్ను కూడా 2026 మార్చి 31 వరకు చెల్లించబడి ఉంది.

అయితే, ప్రమాదానికి గురైన ఈ బస్సుపై తెలంగాణ రాష్ట్రంలో 16 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ. 23,120 వరకు పెండింగ్‌లో ఉంది. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబర్ 9 వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బస్సు ఫిట్‌గానే ఉందన్న రవాణా శాఖ

ఈ బస్సు ఫిట్‌గానే ఉందని, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడం వల్లే బస్సులో మంటలు చెలరేగాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెల్లడించింది. కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నట్లు తెలిపింది. 2018లో డామన్ డయ్యులో రిజిస్ట్రేషన్ చేశారని, 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయినట్లు వెల్లడించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ పేర్కొంది.


More Telugu News