కర్నూల్ బస్సు ప్రమాదంపై షర్మిల దిగ్భ్రాంతి.. ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్

  • కర్నూల్ బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన వైఎస్ షర్మిల
  • ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు
  • సజీవదహనం కావడం అత్యంత విచారకరమని ఆవేదన
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' వేదికగా స్పందించారు.

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని షర్మిల పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని షర్మిల సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి, మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా, ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 19 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో ఫోరెన్సిక్ నిపుణులు వాటిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.


More Telugu News