2029 నాటికి ఏపీలో ప్రపంచస్థాయి విద్య.. ఆస్ట్రేలియాలో మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

  • మెల్‌బోర్న్‌లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొన్న‌ మంత్రి 
  • 'లీప్' (LEAP) కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల మెరుగుప‌డ‌తాయ‌ని వ్యాఖ్య‌
  • ఏఐ, ఆట ఆధారిత పద్ధతులతో విద్యార్థులకు శిక్షణ అవ‌స‌ర‌మ‌న్న లోకేశ్‌
  • ఏటా 1.75 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులకు విక్టోరియా గమ్యస్థానం
  • భారత్ నుంచి పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు విద్యార్థులు
2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేడ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి 'లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శనం చేస్తున్నామని, అంతర్జాతీయ ఉత్తమ బోధనా పద్ధతులతో విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు.

21వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్‌ అన్నారు. "సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ఆట ఆధారిత పాఠ్యాంశాలు, ఏఐ ఆధారిత శిక్షణ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ వంటి వినూత్న కార్యక్రమాలను 'లీప్'లో భాగంగా అమలు చేస్తున్నాం. ఏఐ, అత్యాధునిక టెక్నాలజీల ద్వారా విద్యార్థులకు టెక్నికల్, లీడర్‌షిప్, నిజ జీవిత నైపుణ్యాలు అందిస్తున్నాం. జాతీయ విద్యా విధానం (NEP 2020) లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సవరించాం. అన్ని స్థాయుల్లో నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్నాం" అని తెలిపారు.

ఈ సమావేశంలో స్టడీ మెల్‌బోర్న్ ప్రతినిధులు మాట్లాడుతూ.. విక్టోరియా రాష్ట్రం అంతర్జాతీయ విద్యార్థులకు కీలక గమ్యస్థానంగా ఉందని తెలిపారు. ప్రతి ఏటా 170 దేశాల నుంచి సుమారు 1.75 లక్షల మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారని, వీరిలో భారత్, చైనా, వియత్నాం, నేపాల్ విద్యార్థులే అధికంగా ఉన్నారని చెప్పారు. వీరి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏటా 12.6 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందని వివరించారు. ఆస్ట్రేలియాలో చదువు తర్వాత ఉద్యోగావకాశాలు కోరుకునే వారికి విక్టోరియా సరైన గమ్యస్థానమని, నాణ్యమైన విద్యతో పాటు స్కాలర్‌షిప్‌లు, పని అవకాశాలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా మెల్‌బోర్న్ ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మెల్‌బోర్న్ యూనివర్సిటీ, మోనాష్ యూనివర్సిటీ, స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.



More Telugu News