క‌ర్నూలు బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం
  • హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన
  • ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
  • నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకోవడంతో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. 

కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో అదుపుతప్పిన బైక్ నేరుగా బస్సు ఇంధన ట్యాంక్‌ను తాకడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికీలలు వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.


More Telugu News