కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

  • కర్నూలు జిల్లాలో ప్రైవేటు వోల్వో బస్సులో ఘోర అగ్నిప్రమాదం
  • ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనం
  • హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా చిన్న టేకూరు వద్ద దుర్ఘటన
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీఎం రేవంత్ రెడ్డి
  • మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మాజీ సీఎం జగన్
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు వోల్వో బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమై 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా శుక్రవారం తెల్ల‌వారుజామున‌ ఈ విషాద ఘటన జరిగింది. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంల వరకు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "కర్నూలులో జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారుల‌తో మాట్లాడి అవ‌స‌‌ర‌మైన స‌హాయ‌క‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర అధికారుల‌ను ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గ‌ద్వాల కలెక్ట‌ర్‌, ఎస్పీ ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లాల‌ని సీఎం ఆదేశించారు. 

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ దుర్ఘటనపై స్పందిస్తూ, "ఈ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలి" అని కోరారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు ఎమర్జెన్సీ డోర్ అద్దాలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. చూస్తుండగానే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడంతో మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది.

విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించి, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని రవాణా, సహాయక బృందాలకు మంత్రి సూచనలు జారీ చేశారు.


More Telugu News