తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

  • ఈ నెల 30 నుంచి నవంబర్ 13 వరకు ఫీజు చెల్లింపు గడువు
  • ఆలస్య రుసుముతో డిసెంబర్ 29 వరకు చెల్లించే అవకాశం
  • అన్ని సబ్జెక్టులకు కలిపి ఫీజు రూ.125గా నిర్ధారణ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు
  • ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.60గా నిర్ణయం
పదో తరగతి వార్షిక, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 13వ తేదీలోగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం నిర్దేశిత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు చెల్లించవచ్చు. చివరిగా, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.

ఫీజుల వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలని సూచించారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.60గా నిర్ణయించారు.

అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజును అందజేయాలని ప్రకటనలో తెలిపారు.


More Telugu News