హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు... విదేశీ యువతికి విముక్తి

  • బంజారాహిల్స్‌ హోటల్‌లో వ్యభిచారం
  • ప్రధాన నిర్వాహకుడితో పాటు ఏడుగురు విటులు, రిసెప్షనిస్ట్ అరెస్ట్
  • యువతులకు ఉద్యోగాల ఆశ చూపి వ్యభిచారం
  • నిందితుల నుంచి నగదు, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గుట్టుగా సాగుతున్న ఓ భారీ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌ను కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ దందాపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా చెర నుంచి ఉజ్బెకిస్థాన్ యువతితో సహా ముగ్గురు మహిళలను రక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఆర్-ఇన్ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి హోటల్‌లోని 111, 112 నంబర్ గదులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ప్రధాన నిర్వాహకుడైన ఎండీ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఏడుగురు విటులను, హోటల్ రిసెప్షనిస్ట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విటులంతా కర్నూలుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

‘స్టైల్ మేకర్ సెలూన్’ యజమాని అయిన ఎండీ షరీఫ్, ఆర్థికంగా వెనుకబడిన, ఉద్యోగాలు లేని యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారికి పెద్ద మొత్తంలో జీతాలు, కమీషన్లు ఇస్తామని ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పోలీసులు వెల్లడించారు.

నిందితుల నుంచి రూ. 5,950 నగదు, 13 మొబైల్ ఫోన్లు, 12 వాడని కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News