జగన్ సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు: సోమిరెడ్డి ఫైర్

  • జగన్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి ఘాటు విమర్శలు
  • గూగుల్ తెచ్చానని క్రెడిట్ కొట్టేస్తున్నారని ఆరోపణ
  • నకిలీ మద్యం వ్యవహారంలో జగన్‌దే కీలక పాత్ర అని ఆరోపణ
  • మద్యం బాటిళ్ల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సవాల్
  • రుషికొండ ప్యాలెస్ కట్టుకుని భోగాపురంపై మాట్లాడతారా అని ప్రశ్న
వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తీరు "పాపాలు చేసేవాళ్లు నీతులు చెప్పినట్లుగా" ఉందని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగిన అనేక వ్యవహారాలకు బాధ్యత వహించకుండా, సంబంధం లేని విషయాల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

"పాపాలు చేసేవాళ్లు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. జగన్ ప్రెస్ మీట్‌లో చేసిన కామెంట్లు వింటే, ఏదో నీతులు చెప్పినట్టుగానే ఉన్నాయి" అని సోమిరెడ్డి తన విమర్శలకు పదును పెట్టారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. "గతంలో అదే డేటా సెంటర్‌ను ఒక గోడౌన్ మాత్రమేనని, అక్కడ అంత సీన్ లేదని తమ సొంత పత్రిక సాక్షిలో కథనాలు రాయించారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును తానే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలా మాట్లాడటానికి సిగ్గు, బుద్ధి ఉండాలి" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో కియా మోటార్స్‌ను తన తండ్రే తెచ్చారని చెప్పిన జగన్, ఇప్పుడు గూగుల్ క్రెడిట్ కూడా తానే కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించడం చేతకాక, జాకీ వంటి డ్రాయర్ల కంపెనీని కూడా వెళ్లగొట్టిన ఘనత జగన్‌దని సోమిరెడ్డి ఆరోపించారు.

నకిలీ మద్యం వ్యవహారంపై కూడా సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం దందాలో జగన్ పాత్ర ఉందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే సంబంధం లేదని బుకాయిస్తున్నారని అన్నారు. "జగన్-జోగి రమేశ్-జనార్దన్ రావు కాంబినేషన్‌లో నకిలీ మద్యాన్ని తయారు చేయించి, ప్రజాధనాన్ని గుటుక్కున మింగింది చాలక ఇంకా పిచ్చి కబుర్లు చెబుతారా?" అని ప్రశ్నించారు. మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, ఈ నిజాన్ని ప్రజల నుంచి పక్కదారి పట్టించేందుకే జగన్ దానిని డైవర్షన్ అంటున్నారని మండిపడ్డారు. ఆ క్యూఆర్ కోడ్‌ను దుకాణదారులే కాకుండా వినియోగదారులు, కావాలంటే జగన్ కూడా స్కాన్ చేసి నిజానిజాలు తెలుసుకోవచ్చని సవాల్ విసిరారు.

అభివృద్ధి విషయంలో జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని సోమిరెడ్డి విమర్శించారు. "భోగాల కోసం రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్న పెద్ద మనిషి, ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని అన్నారు. జగన్ తీరును గమనిస్తుంటే, "ఇన్నాళ్లూ జగన్‌ను సగం పిచ్చోడనుకున్నాం, కానీ ఇప్పుడు పూర్తి పిచ్చోడని స్పష్టంగా అర్థమైంది" అంటూ సోమిరెడ్డి తన ట్వీట్‌ను ముగించారు. 


More Telugu News