Damodara Rajanarasimha: హైదరాబాద్ నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

Damodara Rajanarasimha Inaugurates Stem Cell Lab at NIMS Hyderabad
  • నిమ్స్‌‌లో స్టెమ్ సెల్ ల్యాబ్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ
  • మందులతో నయం కాని మొండి వ్యాధులను నయం చేసే సామర్థ్యం స్టెమ్ సెల్ థెరఫీకి ఉందని వెల్లడి
  • భవిష్యత్తులో పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందించవచ్చన్న మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టెమ్ సెల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

విత్తనం నుంచి మహా వృక్షం ఎలా ఎదుగుతుందో, అలాగే స్టెమ్ సెల్స్ ద్వారా కొత్త కణాలు, అవయవాలను సృష్టించవచ్చని మంత్రి వివరించారు. మన శరీరంలోని ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు లేదా తొలగించబడినప్పుడు, ఆ భాగాన్ని తిరిగి రిపేర్ చేసే అద్భుతమైన శక్తి స్టెమ్ సెల్స్‌కు ఉందని తెలిపారు. మందులతో నయం కాని మొండి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం వీటికి ఉందన్నారు.

ముఖ్యంగా క్యాన్సర్, రక్త సంబంధిత వ్యాధులు, తలసేమియా వంటి అనేక రుగ్మతలతో బాధపడే రోగులకు ఈ చికిత్స సంజీవని లాంటిదని మంత్రి పేర్కొన్నారు. ఆయా వ్యాధుల కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని మళ్లీ కొత్తగా సృష్టించేందుకు స్టెమ్ సెల్ థెరపీ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

ప్రస్తుతం స్టెమ్ సెల్ చికిత్స కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉందని, అది కూడా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదని మంత్రి తెలిపారు. సామాన్య ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే నిమ్స్‌లో ఈ స్టెమ్ సెల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో స్టెమ్ సెల్స్‌పై లోతైన పరిశోధనలు జరుగుతున్నాయని, తులసి థెరప్యూటిక్స్‌తో పాటు నిమ్స్ వైద్యులు ఈ పరిశోధనలను నిర్వహిస్తారని మంత్రి వివరించారు. ఈ పరిశోధనల ఫలితంగా భవిష్యత్తులో నిమ్స్‌లోనే పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో స్టెమ్ సెల్ థెరపీ అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని విధాలా సహకారం అందిస్తామని, త్వరలోనే ఈ ల్యాబ్ పరిశోధనల ఫలితాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 
Damodara Rajanarasimha
NIMS Hyderabad
stem cell lab
stem cell therapy
cancer treatment
thalassemia
Tulasi Therapeutics
healthcare
medical research
Hyderabad

More Telugu News