Sanjay Raut: ముంబై మేయర్ పీఠంపై సస్పెన్స్.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

Mumbai Mayor Race Sanjay Raut Claims Close Contest
  • ఏం జరుగుతుందో వేచి చూడాలన్న శివసేన యూబీటీ నేత
  • మేయర్ పీఠానికి జస్ట్ 6 సీట్లు వెనకబడ్డామని వ్యాఖ్య
  • దేవుడి దయ ఉంటే తమ పార్టీ నుంచే మేయర్ అవుతారన్న ఉద్ధవ్ ఠాక్రే
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నా మేయర్ పీఠంపై సస్పెన్స్ వీడడంలేదు. బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే, మేయర్ పదవి కోసం కూటమి పార్టీల మధ్య చిక్కుముడి నెలకొంది. తన పార్టీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన అభ్యర్థులతో ఏక్ నాథ్ షిండే ఓ హోటల్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. బీజేపీతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన కీలక నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ పీఠానికి తాము కేవలం 6 సీట్లు మాత్రమే వెనకబడి ఉన్నామని చెప్పారు.

బీఎంసీ ఎన్నికల్లో శివసేన(యూబీటీ) పార్టీ 65 సీట్లను గెల్చుకోగా.. మిత్ర పక్షాల సీట్లతో కలిపి తమ కూటమికి మొత్తం 109 మంది కార్పొరేటర్లు ఉన్నారని చెప్పారు. మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలంటూ రౌత్ వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. బీఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. తమ పార్టీ నుంచే ముంబై సిటీకి మేయర్ ఉండాలనేది తమ కోరిక అని, దేవుడి దయ ఉంటే బీఎంసీ పీఠం తమదే అవుతుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఓవైపు, బీజేపీ, శివసేన (షిండే) పార్టీల మధ్య మేయర్ పీఠంపై చిక్కుముడి నేపథ్యంలో ఉద్ధవ్, సంజయ్ రౌత్ వ్యాఖ్యలతో మరింత సస్పెన్స్ నెలకొంది.

సంజయ్ రౌత్ చెప్పిన లెక్కలివీ..
శివసేన(యూబీటీ)=65, ఎంఎన్ఎస్=6, కాంగ్రెస్, వీబీఏ కూటమి= 24, ఎంఐఎం= 8, ఎస్పీ= 2, ఎన్సీపీ (అజిత్ పవార్) = 3, ఎన్సీపీ (శరద్ పవార్) = 1.. మొత్తం 109 సీట్లు.

మహాయుతి కూటమి.. 
బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలు గెల్చుకోగా, మహాయుతి కూటమిలోని శివసేన (షిండే వర్గం) 29 సీట్లను దక్కించుకుంది. దీంతో మెజారిటీ మార్క్ 114 సీట్లను కూటమి దాటేసింది. అయితే, మేయర్ సీటు కోసం ఇరు పార్టీలు పట్టుబడుతుండడంతో ముంబై రాజకీయాల్లో సస్పెన్స్ కొనసాగుతోంది.
Sanjay Raut
BMC Elections
Mumbai Mayor
Shiv Sena UBT
Eknath Shinde
BJP
Maharashtra Politics
Uddhav Thackeray
Municipal Corporation
Mahayuti Coalition

More Telugu News