వర్ష ప్రభావిత జిల్లాలకు నిధుల విడుదల... దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

  • దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు 
  • అక్కడి నుంచే భారీ వర్షాలపై సమీక్ష
  • నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు
  • మిగతా జిల్లాలకు కోటి రూపాయల చొప్పున కేటాయింపు
  • తక్షణమే విడుదల చేయాలని అధికారులకు ఆదేశం 
  • మంత్రులు, సీఎస్, కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్
రాష్ట్రంలో పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రిచంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ పాలనను పరుగులు పెట్టించారు. దుబాయ్ నుంచే ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తక్షణ సహాయక చర్యలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సంబంధిత మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు తక్షణ సహాయక చర్యల కోసం రూ. 2 కోట్ల చొప్పున అత్యవసర నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. మిగిలిన వర్ష ప్రభావిత జిల్లాలకు కూడా రూ. 1 కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు, కడప, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు రాష్ట్ర విపత్తు స్పందన దళాలను (ఎస్డీఆర్ఎఫ్) వెంటనే తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు జిల్లాలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జాతీయ విపత్తు స్పందన దళాలను (ఎన్డీఆర్ఎఫ్) కూడా రంగంలోకి దించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లకు సూచించారు.


More Telugu News