విక్టోరియా మోడల్‌లో ఏపీ అభివృద్ధి.. సహకారం కోరిన మంత్రి నారా లోకేశ్

  • ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డిమోపౌలోస్‌తో మంత్రి లోకేశ్ భేటీ
  • ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అభ్యర్థన
  • క్రికెట్, హాకీల్లో ఉమ్మడి శిబిరాలు, మ్యాచ్‌ల నిర్వహణకు ప్రతిపాదన
  • తీర ప్రాంత పరిరక్షణకు విక్టోరియా టెక్నాలజీపై ఆసక్తి
  • యువతకు గ్రీన్ జాబ్స్‌లో నైపుణ్యాభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి
  • అరకు, పులికాట్‌లలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి సాయం కోరిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలంటూ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కోరారు. పర్యాటకం, క్రీడలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక రంగాల్లో విక్టోరియా సాధించిన ప్రగతిని, సాంకేతిక నైపుణ్యాన్ని ఏపీకి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన మెల్‌బోర్న్‌లో విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్‌తో గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు రంగాల్లో ఇరు ప్రాంతాల మధ్య బలమైన భాగస్వామ్యానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను ఆయన ముందుంచారు.

పర్యాటకానికి కొత్త రూపు

వారసత్వ పర్యాటక రంగంలో విక్టోరియా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిందని లోకేశ్ ప్రస్తావించారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వాలని కోరారు. "ఆంధ్రప్రదేశ్‌లో పాపికొండలు, విశాలమైన విశాఖ బీచ్ వంటి ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. విక్టోరియాలోని 'గ్రేట్ ఓషన్ రోడ్' తరహాలో పర్యావరణహిత బ్రాండింగ్‌ను ఏపీ తీర ప్రాంతానికి అందించడంలో మీ నైపుణ్యం మాకు అవసరం" అని లోకేశ్ అన్నారు. 

రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో-సర్టిఫికేషన్ వంటి అంశాలపై పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. అలాగే, విక్టోరియాలోని ఆల్పిన్ నేషనల్ పార్క్ తరహాలో ఏపీలోని అరకులో ట్రెక్కింగ్, పులికాట్‌లో వాటర్ స్పోర్ట్స్ వంటి అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి సహకరించాలని కోరారు. అడ్వెంచర్ గైడ్లు, రేంజర్లకు విక్టోరియా సంస్థల ద్వారా శిక్షణ, సర్టిఫికేషన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

పర్యావరణం, క్రీడారంగాల్లో సహకారం

ఆంధ్రప్రదేశ్‌కు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందని గుర్తుచేసిన లోకేశ్, విక్టోరియాలోని పోర్టు ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో అత్యాధునిక వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీ తీరప్రాంతాన్ని పరిరక్షించేందుకు ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, కార్బన్ న్యూట్రల్ టూరిజం వంటి ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని కోరారు.

క్రీడారంగంలోనూ భాగస్వామ్యానికి లోకేశ్ ఆసక్తి చూపారు. ఏపీ, విక్టోరియాల మధ్య క్రికెట్, హాకీ వంటి క్రీడల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు, స్నేహపూర్వక మ్యాచ్‌లు నిర్వహించాలని ప్రతిపాదించారు. స్పోర్ట్స్ సైన్స్ విభాగంలో ఇరు ప్రాంతాల విద్యార్థుల మధ్య మార్పిడి కార్యక్రమాలకు (స్టూడెంట్ ఎక్స్ఛేంజ్) సహకరించాలని కోరారు. విక్టోరియాలోని మెల్‌బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ తరహాలో ఏపీలో ప్రపంచ స్థాయి ఈవెంట్ల నిర్వహణకు సాయం అందించడంతో పాటు, రాష్ట్రంలోని ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

విక్టోరియాలో ఆఫ్ షోర్ విండ్, సోలార్ ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నాయని, అదే తరహాలో ఏపీలోని యువతకు గ్రీన్ జాబ్స్‌పై నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి లోకేశ్ కోరారు.


More Telugu News