బంగ్లాదేశ్ చెరలో ఏపీ జాలర్లు.. దుబాయ్ నుంచే స్పందించిన సీఎం చంద్రబాబు

  • బంగ్లాదేశ్ నౌకాదళం అదుపులో విజయనగరం జిల్లా జాలర్లు
  • వేటకు వెళ్లి పొరపాటున సరిహద్దు దాటిన మత్స్యకారులు
  • జాలర్లను సురక్షితంగా వెనక్కి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం
  • మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని అధికారులకు సూచన
బంగ్లాదేశ్ నౌకాదళం అదుపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల విడుదలకు సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన, విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. జాలర్లను సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

విజయనగరం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలో వారు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడి నౌకాదళ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు, వెంటనే స్పందించారు. 

మత్స్యకారుల కుటుంబాలతో నిరంతరం టచ్‌లో ఉండాలని, వారికి ఎలాంటి ఆందోళన కలగకుండా ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి జాలర్ల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.


More Telugu News