మా దేశ భద్రతను మేమే చూసుకుంటాం: ఇజ్రాయెల్ ప్రధాని

  • ఇజ్రాయెల్ అమెరికా రక్షిత ప్రాంతం కాదన్న ప్రధాని నెతన్యాహు
  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తో నెతన్యాహు సమావేశం
  • దేశ భద్రత విషయంలో ఎవరిపైనా ఆధారపడమన్న నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ తన భద్రతను తానే చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. “ఇజ్రాయెల్ అమెరికా రక్షిత ప్రాంతం కాదు, మా భద్రతా నిర్ణయాలను మేమే తీసుకుంటాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

గాజా కాల్పుల విరమణ ఒప్పంద పురోగతిపై చర్చించేందుకు నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. “ఇజ్రాయెల్ అమెరికా అధీనంలో పనిచేస్తుందనే లేదా అమెరికా ఇజ్రాయెల్ నిర్ణయాలను ప్రభావితం చేస్తుందనే వాదనలు నిరాధారమైనవే. మా దేశ భద్రత విషయాల్లో ఎవరిపైనా ఆధారపడమని చెప్పాలనుకుంటున్నాను” అన్నారు.

గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరించాలన్న ప్రతిపాదనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “ఆ ప్రాంతంలో భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టే విషయంలో ఇజ్రాయెల్ స్వయంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ కోల్పోకూడదు” అని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జేడీ వాన్స్ కూడా నెతన్యాహుతో సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ “శాంతి మార్గంలో అనేక సవాళ్లు ఉన్నాయి. హమాస్‌ను నిరాయుధీకరించడం, ఆ సంస్థ ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా చూడడం, గాజాను పునర్నిర్మించడం వంటి పనులు సులభం కాదు. అయినా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్నాం” అన్నారు.

హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం తాను ఊహించిన దానికంటే మెరుగ్గా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. 


More Telugu News