మా నాన్న రాజకీయ జీవితం చివరి దశలో ఉంది.. వారసుడు ఎవరంటే: సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్యలు

  • బెళగావిలో జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర వ్యాఖ్యలు
  • బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు ఇప్పుడు అవసరమని వ్యాఖ్య
  • ఆ లక్షణాలు సతీశ్ ఝర్కిహోళిలో ఉన్నాయన్న యతీంద్ర
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా, కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడానికి సతీశ్ ఝర్కిహోళి అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మార్పు అంశంపై సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో తన తండ్రి చివరి దశలో ఉన్నారని, ఈ సమయంలో బలమైన, ప్రగతిశీల భావజాలం కలిగిన నాయకుడు ఆయనకు అవసరమని అన్నారు.

అటువంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. సతీశ్‌కు ఆ లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు ఆయన సరైన వ్యక్తి అని యతీంద్ర అన్నారు. పెద్ద బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి మార్పును ఉద్దేశించి యతీంద్ర ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపై సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మధ్య ఇప్పటికే పరోక్షంగా వాగ్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సతీశ్ పేరు తెరపైకి రావడం గమనార్హం.


More Telugu News