బెంగళూరు రహదారులు.. విమర్శలపై ఘాటుగా స్పందించిన కిరణ్ మజుందార్ షా

  • నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న మజుందార్ షా
  • బెంగళూరులోనే జన్మించా, కన్నడ భాషను, సంస్కృతిని ప్రేమిస్తున్నానని వ్యాఖ్య
  • నిధులు ఆఫర్ చేసినట్లు జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన కిరణ్ మజుందార్ షా
బెంగళూరు నగర రహదారులపై బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఇటీవల చేసిన పోస్టులు చర్చనీయాంశమైన విషయం విదితమే. ఆమె చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ విమర్శలు గుప్పించారు. పలువురు నెటిజన్లు ఆమె నిజమైన కన్నడవాసి కాదని ట్రోల్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె చేసిన మరో పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాను బెంగళూరులోనే జన్మించానని, ఏడు దశాబ్దాలుగా తన నగరాన్ని, కన్నడ భాషను, సంస్కృతిని ప్రేమిస్తున్నానని అన్నారు. కన్నడ భాష చదవడం, రాయడం, మాట్లాడటం కూడా తనకు వచ్చని పేర్కొన్నారు. తాను కన్నడ మనిషినని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని ఆమె అన్నారు.

అంతేకాదు, బెంగళూరు రహదారుల మరమ్మతు కోసం తాను నిధులు ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలను కిరణ్ మజుందార్ షా ఖండించారు. బయోకాన్ పార్కుకు వచ్చిన ఒక విదేశీ విజిటర్ బెంగళూరు రహదారులపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని మజుందార్ షా తెలిపారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయం దుమారం రేపాయి.


More Telugu News