చిరంజీవిలా చేయొద్దు.. పవన్ లా చేయండి: విజయ్‌కు అన్నాడీఎంకే నేత సలహా

  • అన్నాడీఎంకే కూటమిలో చేరాలంటూ విజయ్ పార్టీకి ఉదయకుమార్ పిలుపు
  • లేదంటే టీవీకే పార్టీ గల్లంతవడం ఖాయమని హెచ్చరిక
  • చిరంజీవిలా పొత్తుల విషయంలో పొరపాటు చేయొద్దని సూచన
  • పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రస్తావన
  • డీఎంకే మళ్ళీ వస్తే విజయ్‌ను దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్య
తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు విజయ్‌కు అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటును పునరావృతం చేయవద్దని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరహాలో సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. తమ కూటమిలో చేరకపోతే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాజకీయంగా కనుమరుగవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉదయకుమార్ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. తమ కూటమిలో చేరేందుకు మరిన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, ఇదే సమయంలో విజయ్ కూడా తమతో కలవాలని ఆహ్వానించారు.

"అన్నాడీఎంకే మెగా కూటమిలో టీవీకే చేరడానికి ఇదే సరైన సమయం. ఈ అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ మా కూటమిలో చేరకపోతే, ఎన్నికల తర్వాత డీఎంకే ఆ పార్టీని నాశనం చేయడం తథ్యం. టీవీకే అడ్రస్ లేకుండా పోతుంది" అని ఉదయకుమార్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. "ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పొత్తులపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ, పవన్ కల్యాణ్ సరైన సమయంలో సరైన పొత్తు నిర్ణయంతో పార్టీని నిలబెట్టుకోవడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయాన్ని విజయ్ గుర్తుంచుకోవాలి" అని సూచించారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే విజయ్‌ను దేవుడు కూడా కాపాడలేడని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News