15 శాతానికి తగ్గనున్న ట్రంప్ టారిఫ్ లు.. అమెరికాతో భారత్ డీల్..!

  • భారత ఎగుమతులపై ప్రస్తుతం 50 శాతం వసూలు చేస్తున్న అగ్రరాజ్యం
  • త్వరలో ఇరు దేశాల మధ్య కుదరనున్న ఒప్పందం.. తగ్గనున్న సుంకాలు
  • భారతీయ మార్కెట్లలోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎంట్రీ..!
మనదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లు తగ్గనున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇరు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అవుతున్న వస్తువులపై 50 శాతం పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్నందుకు ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలు కూడా ఉన్నాయి. అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని, ఆ తర్వాత ట్రంప్ సుంకాలు 15 శాతానికి తగ్గే అవకాశం ఉందని తెలిపాయి.

రష్యా నుంచి తగ్గనున్న దిగుమతులు
ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించనుందని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించనుందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనం వెల్లడించింది. కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారుపై విశ్వాసం వ్యక్తంచేశారు. 

వ్యవసాయ ఉత్పత్తుల కోసం ట్రంప్ పట్టు..
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కీలకంగా మారాయి. తమ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌ తలుపులు బార్లా తెరవాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చర్చలు ముందుకు సాగడంలేదు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరపడంపైనా ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

భారత మార్కెట్లలోకి అమెరికా మొక్కజొన్న
రష్యా నుంచి దిగుమతులు క్రమంగా తగ్గించడంతో పాటు అమెరికా మొక్కజొన్న, సోయామీల్‌ను కూడా భారత మార్కెట్లోకి అనుమతించే అవకాశం ఉన్నట్లు సదరు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే మొక్కజొన్నపై 15 శాతం దిగుమతి సుంకం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వార్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా నుంచి మొక్కజొన్న దిగుమతులను చైనా తగ్గించుకుంది. ఈ పరిస్థితుల్లో తమ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ట్రంప్ ప్రత్యామ్నాయంగా భారత మార్కెట్లలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.


More Telugu News