గంటకు 453 కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఆవిష్కరించిన చైనా

  • గంటకు 453 కిలోమీటర్ల వేగంతో రికార్డు సృష్టించిన సీఆర్ 450
  • పాత మోడల్ సీఆర్ 400 కంటే అత్యాధునిక టెక్నాలజీతో రూపకల్పన
  • షాంఘై-చెంగ్డూ మార్గంలో ప్రారంభమైన ట్రయల్ రన్స్
  • ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రయాణం
  • ఆరు లక్షల కిలోమీటర్ల టెస్టింగ్ తర్వాత సేవలు ప్రారంభం
రైల్వే రవాణాలో చైనా మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలు ‘సీఆర్450’ని ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే జరిగిన ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 453 కిలోమీటర్ల (281 మైళ్లు) వేగాన్ని అందుకుని కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ఈ రైలుకు సంబంధించిన ప్రి-సర్వీస్ టెస్టింగ్ షాంఘై-చోంగ్‌కింగ్-చెంగ్డూ రైల్వే మార్గంలో జరుగుతోంది.

ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి వచ్చాక, ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం చైనాలో నడుస్తున్న సీఆర్ 400 ఫక్సింగ్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా సీఆర్ 450 దానికంటే అత్యాధునికమైనది. పాత మోడల్‌తో పోలిస్తే దీని బరువును 50 టన్నుల వరకు తగ్గించారు. గాలి నిరోధకతను 22 శాతం తగ్గించేందుకు ఏరోడైనమిక్ డిజైన్‌ను మెరుగుపరిచారు.

ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలోనే సున్నా నుంచి గంటకు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇటీవల రెండు సీఆర్ 450 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణిస్తూ గంటకు 896 కిలోమీటర్ల సంయుక్త వేగాన్ని నమోదు చేసి మరో అరుదైన ఘనత సాధించాయి. ప్రయాణికుల సేవల్లోకి ప్రవేశపెట్టే ముందు, ఈ రైలు దాదాపు 6 లక్షల కిలోమీటర్ల దూరం ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు పూర్తయ్యాక, ఇది ప్రయాణికులకు మరింత నిశ్శబ్దమైన, పర్యావరణహితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.  


More Telugu News