పంజాబ్ మాజీ డీజీపీ కుమారుడు అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు

  • కుటుంబ సభ్యులే కేసులో నిందితులుగా మారిన వైనం
  • మృతుడు అఖీల్ అఖ్తర్ సంచలన ఆరోపణలు చేసిన వీడియో వెలుగులోకి 
  • పంజాబ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన అఖీల్ అఖ్తర్ మృతి కేసు  
పంజాబ్‌లో మాజీ డీజీపీ మహ్మద్‌ ముస్తాఫా కుమారుడు అఖీల్‌ అఖ్తర్‌ మృతి కేసు సంచలనం రేపుతోంది. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు పరిగణించినప్పటికీ, తాజాగా లభించిన ఆధారాలతో దీనిని హత్య కేసుగా మార్చారు. కుటుంబ సభ్యులపైనే పోలీసులు హత్య అభియోగాలు మోపారు.

33 ఏళ్ల అఖీల్‌ అఖ్తర్‌ ఈ నెల 16న పంచకులలోని తన నివాసంలో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డ్రగ్స్‌ అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించాడని తల్లిదండ్రులు తెలిపారు. దీని ఆధారంగా పోలీసులు మొదట సహజ మృతిగా కేసు నమోదు చేశారు.

అయితే, మరణానికి కొన్ని రోజుల ముందు అఖీల్‌ రికార్డు చేసిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ వీడియోలో అఖీల్‌ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.

"నా భార్యకు నా తండ్రితో సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత నేను మానసికంగా కుంగిపోయాను. నన్ను పిచ్చోడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులో ఇరికించడమో లేదా చంపేయడమో చేస్తారేమో అనిపిస్తోంది. ఈ కుట్రలో నా తల్లి, సోదరి కూడా భాగస్వాములే" అని అఖీల్‌ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసును పునఃపరిశీలించి, అఖీల్‌ కుటుంబసభ్యులపై హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అఖీల్‌ తండ్రి ముస్తాఫా పంజాబ్ విశ్రాంత డీజీపీ కాగా, తల్లి రజియా సుల్తానా కాంగ్రెస్ నాయకురాలు, గతంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 


More Telugu News