ఏపీలో పేకాట శిబిరాల నిర్వహణపై ఫిర్యాదు .. డీజీపీని నివేదిక కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • ఏపీలో పేకాట శిబిరాల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు
  • డీజీపీని వివరణ కోరిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని డీజీపీకి ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా జరుగుతున్న పేకాట శిబిరాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వివిధ జిల్లాల ప్రజలు పంపిన ఫిర్యాదుల్లో, కొందరు ప్రముఖులు పేకాట కేంద్రాలను నిర్వహిస్తూ, నెలవారీ మామూళ్లు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జూదం నిర్వహించడం, ఆడడం రెండూ నేరమని, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 ప్రకారం శిక్షార్హమైన చర్యలని చట్టం స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీశారు.

పోలీసు అధికారులు ఈ అంశంపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 


More Telugu News