ట్రంప్-పుతిన్ సమావేశం వాయిదా

  • హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరగాల్సి ఉన్న ట్రంప్ - పుతిన్ సమావేశం
  • ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు వాయిదా పడ్డాయన్న వైట్ హౌస్ 
  • ఉక్రెయిన్ యుద్దం పరిష్కారంపై ఇరుదేశాధ్యక్షుల మధ్య బేధాభిప్రాయాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఈ భేటీ జరగాల్సి ఉండగా, ప్రస్తుతం నిరవధికంగా వాయిదా వేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇరుదేశాల అధ్యక్షుల భేటీకి ముందుగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఈ సమావేశం కూడా వాయిదా పడిందని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్షుల భేటీకి ముందు నిర్మాణాత్మక చర్చల కోసం ఈ సమావేశం ఉద్దేశించబడిందని రష్యా పేర్కొంది.

ఇరు దేశాధ్యక్షుల భేటీ వాయిదాకు గల స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు. అయితే, ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారంపై అమెరికా–రష్యా అధ్యక్షుల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా సహకార చర్చలు జరపాలన్న రూబియో ప్రతిపాదనపై ఇరుదేశాల మధ్య విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం.

క్రెమ్లిన్ వర్గాలు ఈ అంశంపై స్పందిస్తూ, ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య “నిర్మాణాత్మకమైన చర్చలు” జరిగాయని పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధనకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదని తెలిపాయి.

ఇటీవల ఫోన్ సంభాషణలో ట్రంప్, పుతిన్‌లు హంగేరీలో భేటీ కావాలని నిర్ణయించుకున్నా, ఉక్రెయిన్ వివాదంపై అభిప్రాయ భేదాల కారణంగా సమావేశం తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో ట్రంప్ చేసిన చర్చలు మాత్రం సానుకూలంగా జరిగాయని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. 


More Telugu News