ఏపీకి గూగుల్ రాకపై తమిళనాట రాజకీయ రగడ... ఒక్క మాటతో తేల్చేసిన నారా లోకేశ్

  • విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్
  • తమిళనాడు డీఎంకేపై అన్నాడీఎంకే విమర్శలు
  • డీఎంకే ప్రభుత్వ వైఫల్యం వల్లే పెట్టుబడి ఏపీకి వెళ్లిందన్న అన్నాడీఎంకే
  • గూగుల్ సీఈవో తమిళ వ్యక్తి అయినా పెట్టుబడి తేలేకపోయారని విమర్శ
  • ఈ రాజకీయ వివాదంపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వ్యవహారం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను ఆయన పంచుకున్నారు.

విశాఖకు గూగుల్ రూపంలో భారీ పెట్టుబడి రావడంపై తమిళనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమిళనాడులోని మధురైలో జన్మించారని, అలాంటి తమిళ మూలాలున్న వ్యక్తి నేతృత్వంలోని సంస్థ నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని అన్నాడీఎంకే తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను నారా లోకేశ్ తన పోస్టులో పంచుకున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. సుందర్ పిచాయ్ ఆంధ్రప్రదేశ్‌ను కాదు, పెట్టుబడుల కేంద్రంగా భారత్‌ను ఎంచుకున్నారని ఒక్క మాటలో తేల్చేశారు. "HE CHOOSE BHARAT" (ఆయన భారత్‌ను ఎంచుకున్నారు) అంటూ తన పోస్టుకు వ్యాఖ్యను జోడించారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఎందుకు మీకీ కొట్లాట... ఆయన డేటా సెంటర్ పెడుతోంది భారత్ లోనేగా అని అర్థం వచ్చేలా... లోకేశ్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడిని కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా, దేశ విజయంగా చూడాలన్న సందేశాన్ని లోకేశ్ తన పోస్ట్ ద్వారా తెలియజేశారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒప్పందం ప్రకారం, గూగుల్ సంస్థ విశాఖపట్నంలో తన డేటా సెంటర్, ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. రాబోయే ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.33 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మారుతుందని ఏపీ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.


More Telugu News