పాక్ క్రికెట్‌లో కలకలం.. పాలస్తీనాకు మద్దతిచ్చినందుకే కెప్టెన్‌పై వేటు వేశారా?

  • పాకిస్థాన్ వన్డే కెప్టెన్సీ నుంచి మహమ్మద్ రిజ్వాన్‌పై వేటు
  • కొత్త సారథిగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది నియామకం
  • ఈ నిర్ణయం వెనుక హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఉన్నారన్న ఆరోపణలు
  • పాలస్తీనాకు మద్దతివ్వడమే కారణమని మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు
  • ఎలాంటి కారణం చెప్పకుండా కెప్టెన్‌ను మార్చేసిన పాక్ క్రికెట్ బోర్డు
పాకిస్థాన్ క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పు తీవ్ర వివాదానికి దారితీసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం వెనుక సంచలన కారణాలు ఉన్నాయంటూ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రిజ్వాన్ బహిరంగంగా పాలస్తీనాకు మద్దతు తెలపడమే అతని పదవికి ఎసరు తెచ్చిందని, ఈ నిర్ణయం వెనుక జట్టు వైట్ బాల్ ఫార్మాట్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఉన్నారని లతీఫ్ ఆరోపించాడు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనూహ్యంగా రిజ్వాన్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి, అతని స్థానంలో స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని కొత్త కెప్టెన్‌గా నియమించింది. గతేడాది అక్టోబర్‌లో బాబర్ ఆజమ్ స్థానంలో కెప్టెన్ అయిన రిజ్వాన్‌ను ఇంత తక్కువ వ్యవధిలో తొలగించడం, అలాగే ఇటీవల టీ20 కెప్టెన్సీ కోల్పోయిన షాహీన్‌కు తిరిగి వన్డే పగ్గాలు అప్పగించడం క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ పరిణామాలపై రషీద్ లతీఫ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. "కేవలం పాలస్తీనా జెండా పట్టుకున్నందుకే కెప్టెన్సీ నుంచి తీసేస్తారా? ఈ నిర్ణయం వెనుక మైక్ హెస్సన్ ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో రిజ్వాన్ పాటిస్తున్న మతపరమైన సంస్కృతి అతనికి నచ్చలేదు. అందుకే ఈ మార్పు జరిగింది" అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

గతంలో రిజ్వాన్ పలుమార్లు పాలస్తీనాకు తన మద్దతును ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకపై గెలిచిన తర్వాత ఆ విజయాన్ని గాజా ప్రజలకు అంకితమిచ్చాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో తన జట్టు తరఫున కొట్టే ప్రతీ సిక్సర్‌కు, తీసే ప్రతీ వికెట్‌కు పాలస్తీనా స్వచ్ఛంద సంస్థలకు రూ. లక్ష విరాళం ఇస్తానని ప్రకటించడం తెలిసిందే.

అయితే, రిజ్వాన్‌ను తొలగించడానికి గల కారణాలను పీసీబీ అధికారికంగా వెల్లడించలేదు. ఇస్లామాబాద్‌లో సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌తో జరిగిన సమావేశం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాత్రమే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయానికి పీసీబీలోని సీనియర్ అధికారుల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


More Telugu News