దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, పలువురు అమెరికా చట్టసభ సభ్యులు

  • చెడుపై మంచి సాధించిన విజయంగా అభివర్ణించిన కాష్ పటేల్
  • చీకటిని వెలుగు జయిస్తుందంటూ వివేక్ రామస్వామి శుభాకాంక్షలు
  • టెక్సాస్ గవర్నర్ భవనంలో దీపావళి వేడుకలు
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్‌తో సహా పలువురు అమెరికన్ డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన ప్రతినిధులు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న ప్రజలకు కాష్ పటేల్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకను అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతోమంది వెలుగుల దీపావళి జరుపుకుంటున్నారంటూ ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

ఎఫ్‌బీఐకి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి భారతీయ అమెరికన్ కాష్ పటేల్. ఆయన భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీపావళిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తన సందేశంలో కాష్ పటేల్ పేర్కొన్నారు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఇది అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటని ఆయన గుర్తు చేశారు.

ప్రముఖ రిపబ్లికన్ నాయకుడు, ఒహియో గవర్నర్ అభ్యర్థి వివేక్ రామస్వామి కూడా 'ఎక్స్' వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చీకటిపై వెలుగు సాధించే విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు.

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆస్టిన్ నగరంలోని తన భవనంలో దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి భారత కాన్సుల్ జనరల్ డీ.సీ. మంజునాథ్ హాజరయ్యారు.

హూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ 'ఎక్స్' వేదికగా ఒక పోస్టు చేసింది. టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో గల గవర్నర్ భవనంలో దీపావళి వేడుకలు జరిగాయని, ఇండో-అమెరికన్ సమాజంతో దీపావళి జరుపుకునే ఈ సంప్రదాయాన్ని కొనసాగించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అని పేర్కొంది. డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు పీట్ సెషన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. రిపబ్లికన్ బ్రియాన్ ఫిట్జ్‌పాట్రిక్, డెమోక్రాట్ సుజాన్ డెల్బెన్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.


More Telugu News