బెంగళూరులో ఓలా ఉద్యోగి ఆత్మహత్య.. సీఈవోపై కేసు నమోదు

  • ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఉన్న వాంగ్మూలం ఆధారంగా కేసు
  • గత నెల 28న విషాదం.. 28 పేజీల మరణవాంగ్మూలం రాసిన అరవింద్
  • తనను వేధిస్తున్నట్లు వాంగ్మూలంలో ఆరోపించిన అరవింద్
ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఓలా వ్యవస్థాపకుడు కమ్ సీఈఓ భవిష్ అగర్వాల్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుబ్రత్ కుమార్ దాస్‌పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. 38 ఏళ్ల మృతుడు కె. అరవింద్ కార్యాలయంలో తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ 28 పేజీల మరణ వాంగ్మూలం రాశారు. అరవింద్ సోదరుడు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎఫ్‌ఐఆర్‌లో భవిష్ అగర్వాల్, ఓలాలో వెహికల్ హోమోలాగేషన్స్ అండ్ రెగ్యులేషన్‌కు నాయకత్వం వహిస్తున్న సుబ్రత్ కుమార్ దాస్, మరికొందరిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. అరవింద్ మరణం తర్వాత రూ. 17.46 లక్షల ఆర్థిక అవకతవకలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఈ విషాదం సెప్టెంబర్ 28న చోటుచేసుకుంది. అరవింద్ తన నివాసంలో విషం తాగడంతో, అతడిని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని, కానీ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని సమాచారం. ఆ తర్వాత అరవింద్ కుటుంబానికి మరణ వాంగ్మూలం లభ్యమైంది. అందులో ఉన్నతాధికారులు తనను వేధింపులకు గురి చేశారని ఆరోపించినట్లు తెలుస్తోంది.

అరవింద్ బ్యాంకు ఖాతాకు జరిగిన కొన్ని నగదు బదిలీలకు సంబంధించి కంపెనీ హెచ్ఆర్ విభాగం స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోయిందని ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు సీనియర్ దర్యాప్తు అధికారి ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై ఓలా నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


More Telugu News