ఇన్ఫోసిస్ ఏపీకి పోతే పరిస్థితి ఏమిటి?: కుమారస్వామి ఆందోళన

  • కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి తీవ్ర విమర్శలు
  • పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం అవమానిస్తోందని మండిపాటు
  • నారాయణమూర్తి దంపతులపై సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన వైనం
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే, ఒకవేళ ఇన్ఫోసిస్ సంస్థ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదని ఆయన మండిపడ్డారు.

కులగణనలో పాల్గొనబోమంటూ తమ హక్కును వినియోగించుకున్నందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన అర్ధాంగి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అవమానించేలా మాట్లాడారని కుమారస్వామి ఆరోపించారు. "మీ అవసరం మాకు లేదు" అన్నట్లుగా పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

ఇదే తరహాలో, నగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేస్తే, ఆమె అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రభుత్వంలోని నేతలు మాట్లాడటం దారుణమని కుమారస్వామి విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పరోక్షంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఉద్దేశించినట్లు స్పష్టమవుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని కుమారస్వామి విమర్శించారు. కేవలం నిధుల కొరత కారణంగా పాత పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని ఆయన తప్పుబట్టారు. 


More Telugu News