టీటీడీలో కోవర్టులు... సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు

  • అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు
  • పరకామణిలో కాంట్రాక్టర్ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఫిర్యాదు
  • భూమనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని వినతి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు నిన్న పలువురు దేవస్థానం ఉద్యోగులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

టీటీడీలో వైసీపీ కోవర్టులను నిరోధించాలని, పరకామణిలో దోషులను శిక్షించాలని, శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

టీటీడీ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ చైర్మన్ జేవీ నరసింహమూర్తి, టీఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలాజీ తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ పరకామణి విభాగంలో శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాడని, అతని చర్యల వలన టీటీడీకి ఆర్థిక నష్టం కలుగుతోందని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ఉద్యోగులకు బదిలీల విషయంలో అన్యాయం జరుగుతోందని విన్నవించారు. లైసెన్సు పోర్టర్లకు కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను ఇప్పటికీ అమలు చేయలేదని, శాశ్వత ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లలో ఉన్న లోపాలను సరిదిద్దాలని కోరారు.

దేవస్థానం ఉద్యోగుల ప్రమోషన్‌ల సమస్యలను త్వరగా పరిష్కరించాలని, టీఎన్‌టీయూసీకి మునుపటి మాదిరిగా టీటీడీ పరిధిలో ప్రత్యేక కార్యాలయం కేటాయించాలని కోరారు.

ఉద్యోగ సంఘాల నేతల వినతులపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, ఈ అంశాలపై ఉన్నతాధికారులతో, టీటీడీ పాలక మండలితో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చినట్టు నేతలు ఒక ప్రకటనలో వెల్లడించారు. 


More Telugu News