వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది: హోంమంత్రి అనిత

  • దారకానిపాడులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు అనిత, నారాయణ
  • నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఘటన
  • వైసీపీ నేతలు విభేదాలు సృష్టించేందుకు నీచ రాజకీయాలకు దిగజారుతున్నారన్న మంత్రి అనిత
నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలం, దారకానిపాడులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగురి నారాయణతో కలిసి ఆమె హతుడి నివాసానికి వెళ్లి లక్ష్మీనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. హత్య ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హత్యకు కారణాలు, విచారణ పురోగతి, బాధిత కుటుంబానికి అందించాల్సిన సాయం తదితర అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎంకు సమర్పించనున్నట్లు మంత్రి అనిత తెలిపారు. వైసీపీ నేతలు విభేదాలు సృష్టించేందుకు నీచ రాజకీయాలకు దిగజారుతున్నారని ఆమె విమర్శించారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలుస్తుందని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హామీ ఇచ్చారు.

కాగా, దారకానిపాడు గ్రామంలో జరిగిన ఈ హత్య తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శల దాడి జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 


More Telugu News