దీపావళి వేళ పారిశ్రామిక రంగానికి తియ్యని కబురు చెప్పిన సీఎం చంద్రబాబు

  • పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక
  • పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాల కింద తొలి విడత నిధులు
  • రూ. 1,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటన
  • ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమలకు అండగా ఉంటామని స్పష్టీకరణ
  • పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేస్తామన్న చంద్రబాబు
దీపావళి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమలకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలకు సంబంధించి తొలి విడతగా రూ. 1,500 కోట్లను విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ పండుగ చీకటిపై వెలుగు సాధించే విజయానికి ప్రతీక అని, ఈ స్ఫూర్తితోనే పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.

ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, పారిశ్రామిక రంగానికి అండగా నిలబడాలన్న తమ నిబద్ధతలో వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని బలోపేతం చేసి, రాష్ట్రాన్ని వ్యాపారానికి, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ, "ఆశావహ దృక్పథమే పురోభివృద్ధికి చోదకశక్తి. ఈ నమ్మకంతోనే ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రాన్ని నడిపించే మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉంటాం" అని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయగలమని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. తాజా నిర్ణయంతో పారిశ్రామిక వర్గాల్లో నూతనోత్సాహం నెలకొంది.


More Telugu News