35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. క్రీజులో అయ్యర్, పటేల్

  • వర్షం కారణంగా పదకొండవ ఓవర్ లో ఆగిన మ్యాచ్
  • అప్పటికే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్
  • ఎనిమిది పరుగులు చేసి ఔటైన రోహిత్, కోహ్లీ డకౌట్
భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య పెర్త్ లో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌ కు వరణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా 11.5 ఓవర్ల వద్ద ఆటను నిలిపేశారు. తాజాగా వర్షం ఆగడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే, వర్షం ఎఫెక్ట్ తో మ్యాచ్ ను 35 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 37/3. శ్రేయస్‌ అయ్యర్‌ (6), అక్షర్‌ పటేల్‌(7) క్రీజులో ఉన్నారు. గిల్‌ 10 పరుగుల వద్ద, రోహిత్‌ శర్మ 8 పరుగుల వద్ద ఔట్ కాగా, కోహ్లీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు.

పెర్త్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత బ్యాటింగ్‌కు వెన్నెముక వంటి ఆటగాళ్లు అయిన ఓపెనర్ రోహిత్ శర్మ, ఫస్ట్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్వల్ప స్కోరుకే ఔటవడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.

భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికే తొలి షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన సీనియర్ ఆటగాడు, ఓపెనర్ రోహిత్ శర్మ(14 బంతుల్లో 8 పరుగులు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి అతను ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, ఆ తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు.


More Telugu News