పిల్లలతో అసభ్యకరమైన కంటెంట్.. యూట్యూబ్ ఛానళ్లపై పోక్సో చట్టం కింద కేసు

  • రెండు ఛానళ్లపై సైబర్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదు
  • సామాజిక మాధ్యమాల్లో ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదని హెచ్చరిక
  • చట్ట ప్రకారం బాధ్యులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ
మైనర్ పిల్లలతో అసభ్యకరమైన కంటెంట్ రూపొందించిన రెండు యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ 'ఎక్స్' వేదికగా తెలియజేశారు. సంబంధిత యూట్యూబ్ ఛానళ్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానళ్లకు ఆయన మరోసారి హెచ్చరిక జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛ ఉంది కదా అని ఏ తరహా కంటెంట్ అయినా సృష్టిస్తామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. చట్ట ప్రకారం బాధ్యులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు.

కాగా, వీక్షకుల వ్యామోహంలో విలువలను విస్మరించకూడదని సజ్జనార్ రెండు రోజుల క్రితం సూచించారు. కేవలం వ్యూస్, లైక్‌ల కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందడానికి చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సముచితం కాదని ఆయన హితవు పలికారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ రూపొందించడం పట్ల ఆయన గత కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News