తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు.. లోగో ఆవిష్కరించిన కవిత

  • టీచర్ల కోసం కవిత కొత్త సంఘం
  • ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీ అమలు చేయాలన్న కవిత
  • రిటైర్డు ఉద్యోగులకు ప్రయోజనాలకు ప్రయోజనాలు అందకపోవడంపై ఆగ్రహం
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల చెల్లింపు నుంచి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వరకు పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్తగా ఆవిర్భవించిన 'తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌ (TJTF)' ప్రారంభోత్సవం ఈ వ్యాఖ్యలకు వేదికైంది.

శనివారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి కవిత ఈ కొత్త ఫెడరేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లకు ఇప్పటికీ హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు అందకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేజీబీవీ ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు నిలిచిపోయాయని, దీపావళి లోపు వాటిని చెల్లించాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని పాటిస్తూ, కేజీబీవీ టీచర్ల జీతాలను పెంచాలని సూచించారు. అదేవిధంగా, గురుకుల టీచర్లపై హాస్టల్ డ్యూటీల భారం వేయకుండా, ప్రత్యేకంగా వార్డెన్లు, కేర్‌టేకర్లను నియమించాలని అన్నారు. న్యూ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.

ఒలింపిక్ పతకాల గురించి మాట్లాడే ముందు, పాఠశాలల్లో కనీసం పీఈటీ టీచర్లు లేరన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కవిత చురక అంటించారు. పీఈటీలు లేకుండా క్రీడల్లో పతకాలు ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీచర్లు కీలక పాత్ర పోషించారని, కోటి బతుకమ్మ జాతరను విజయవంతం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ భావజాల వ్యాప్తిలో ప్రొఫెసర్ జయశంకర్ అందరికీ గురువని, ఆయనే తనకు అత్యంత ఇష్టమైన ఉపాధ్యాయుడని పేర్కొన్నారు. పాత సంఘాలతో కలిసి టీజేటీఎఫ్ ఉపాధ్యాయుల హక్కుల కోసం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. 


More Telugu News