పాక్-ఆఫ్ఘన్ వివాదాన్ని పరిష్కరించడం నాకో లెక్క కాదు.. ఎంతో చేసినా నోబెల్ రాలేదు: ట్రంప్

  • పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ వివాదాన్ని సులువుగా పరిష్కరిస్తానన్న ట్రంప్
  • ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపేశానని వెల్లడి
  • భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పింది కూడా తానేనని పునరుద్ఘాటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, ఇప్పుడు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే తన తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ వివాదాన్ని పరిష్కరించడం తనకు చాలా సులువైన పని అని ఆయన అభివర్ణించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం నాకు తెలుసు. నేను తలచుకుంటే ఆ సమస్యను పరిష్కరించడం చాలా తేలిక. ఇది నా తొమ్మిదో లక్ష్యం అవుతుంది. ప్రస్తుతానికి నేను అమెరికాను నడపాలి, కానీ యుద్ధాలను పరిష్కరించడం నాకిష్టం" అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా, అణుశక్తి దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య శాంతిని నెలకొల్పింది తానేనని ట్రంప్ మరోసారి తన పాత వాదనను వినిపించారు. అయితే, ఆయన వాదనను గతంలోనే భారత ప్రభుత్వం గట్టిగా ఖండించింది. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది.

ఇంత చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. రువాండా, కాంగో, భారత్-పాకిస్థాన్ వంటి ఎన్నో వివాదాలు పరిష్కరించాను. ప్రతీసారి, 'ఈ యుద్ధం ఆపితే మీకు నోబెల్ బహుమతి వస్తుంది' అని అనేవారు. కానీ నాకు రాలేదు. ప్రాణాలు కాపాడటం తప్ప నాకు వేరే విషయాలపై ఆసక్తి లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనకంటే ముందున్న ఏ అధ్యక్షుడు ఒక్క యుద్ధాన్ని కూడా ఆపలేదని, తాను మాత్రం కోట్లాది మంది ప్రాణాలను కాపాడానని ఆయన పేర్కొన్నారు. 


More Telugu News