యుద్ధం ఆపండి.. ఇద్దరూ విజయం ప్రకటించుకోండి: జెలెన్‌స్కీకి ట్రంప్ సలహా

  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ
  • యుద్ధం ఆపి, ఒప్పందం చేసుకోవాలని కీలక సూచన
  • టోమాహాక్ క్షిపణులు కావాలని పట్టుబట్టిన జెలెన్‌స్కీ
  • క్షిపణులపై వెనకడుగు వేసిన డొనాల్డ్ ట్రంప్
  • పుతిన్‌తో త్వరలో మరోసారి భేటీకి రంగం సిద్ధం
యుద్ధాన్ని తక్షణమే ఆపేసి, ఇరు దేశాలూ విజయం ప్రకటించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సూచన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడిన మరుసటి రోజే, వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ట్రంప్ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

జెలెన్‌స్కీతో సమావేశం చాలా ఆసక్తికరంగా, స్నేహపూర్వకంగా జరిగిందని ట్రంప్ తెలిపారు. "హత్యలు ఆపి, ఒక ఒప్పందానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని నేను జెలెన్‌స్కీకి చెప్పాను. ఇదే విషయాన్ని పుతిన్‌కు కూడా గట్టిగా సూచించాను" అని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలూ ఉన్నచోటే ఆగిపోవాలని, ఇద్దరూ విజయం సాధించినట్టు ప్రకటించుకోవాలని ట్రంప్ సలహా ఇచ్చారు. "చరిత్రే దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై కాల్పులు, మరణాలు, అనవసరమైన భారీ ఖర్చులు వద్దు. నేను అప్పుడే అధ్యక్షుడిగా వుండి ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు" అని ఆయన అన్నారు.

అయితే, ఈ సమావేశంలో టోమాహాక్ క్షిపణుల అంశంపై ఇరువురి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉక్రెయిన్‌కు టోమాహాక్‌లు అవసరం లేని పరిస్థితి రావాలని తాను కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. "ఆ క్షిపణులు అమెరికా భద్రతకు అవసరం" అని ఆయన స్పష్టం చేశారు. కానీ, జెలెన్‌స్కీ మాత్రం తమకు సుమారు 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల టోమాహాక్‌లు కచ్చితంగా కావాలని గట్టిగా కోరారు.

పుతిన్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేయగా, జెలెన్‌స్కీ మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడారు. పుతిన్‌కు ఆ ఉద్దేశం లేదని ఆయన అన్నారు. కాగా, గురువారం పుతిన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో గొప్ప పురోగతి సాధించామని ట్రంప్ వెల్లడించారు. త్వరలో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. ఈ భేటీకి మార్గం సుగమం చేసేందుకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో నేతృత్వంలోని బృందం రష్యా అధికారులతో చర్చలు జరపనుంది.

మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతు అందించడంలో ట్రంప్ విఫలమయ్యారని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యుడు గ్రెగొరీ మీక్స్ విమర్శించారు. "ఇది బలంతో శాంతిని సాధించడం కాదు, బుజ్జగింపుల ద్వారా బలహీనతను ప్రదర్శించడం" అని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News