Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట... అమెరికా వెళ్లేందుకు కోర్టు అనుమతి

Mithun Reddy Gets Relief Court Allows US Trip
  • ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల  23 నుంచి నవంబర్ 4 వరకు అమెరికా వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
  • రూ.50 వేల విలువ గల రెండు జామీను బాండ్లను సమర్పించాలని ఆదేశించిన కోర్టు
  • న్యూయార్క్‌ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే పాస్‌పోర్టును సిట్‌ అధికారులకు అప్పగించాలని షరతు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. న్యూయార్క్ పర్యటనకు సంబంధించిన ఆయన అభ్యర్థనను విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు ఇదివరకే బెయిల్ మంజూరు అయింది.

అమెరికా వెళ్లే భారత పార్లమెంట్ సభ్యుల బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉండటంతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళేందుకు కోర్టు అనుమతి తీసుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో అమెరికా వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియగా, నిన్న ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 23 నుంచి నవంబర్ 4 వరకు ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళేందుకు కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

రూ. 50 వేల విలువ గల రెండు జామీను బాండ్లను సమర్పించాలని మిథున్‌ రెడ్డిని ఆదేశించింది. అదనంగా, న్యూయార్క్‌‌లో ఎక్కడ బస చేయనున్నారో, పూర్తి చిరునామా వివరాలను కోర్టుకు అందజేయాలని కూడా ఉత్తర్వులో పేర్కొంది. అలాగే, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లను వెంటనే కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. న్యూయార్క్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే పాస్‌పోర్టును సిట్ అధికారులకు అప్పగించాలని షరతు విధించింది.

అదేవిధంగా, న్యూయార్క్ వెళ్ళడానికి బుక్ చేసిన విమాన టికెట్ల ఫోటో కాపీలను కోర్టులో సమర్పించాలని విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. 
Mithun Reddy
AP Liquor Scam
YSRCP MP
ACB Court
New York
USA Tour
Bail
Vijayawada
Court Permission

More Telugu News