ఏపీలో గూగుల్ రాకపై కర్ణాటక మంత్రి విమర్శలు... మండిపడిన ఏపీ బీజేపీ

  • వైజాగ్‌ గూగుల్‌ డేటా సెంటర్‌కు ఏపీ భారీ రాయితీలు
  • 25% భూమి, ఉచిత నీరు, కరెంటు ఇస్తున్నారన్న కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే
  • ఇంతటి రాయితీలు ఏ రాష్ట్రమైనా భరించగలదా అని ప్రశ్న
  • ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టిన ఏపీ బీజేపీ శాఖ
  • ఇది భారతదేశ ఏఐ భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి అని స్పష్టీకరణ
  • బెంగళూరు మౌలిక వసతులపై దృష్టి పెట్టాలంటూ బీజేపీ హితవు
విశాఖపట్నంలో టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై ఏపీ బీజేపీ ఇచ్చిన ఘాటు సమాధానంతో ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

గూగుల్ డేటా సెంటర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తోందని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. "విశాఖపట్నంలో గూగుల్‌కు 25 శాతం భూమి, ఉచితంగా నీరు, విద్యుత్‌ను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఇంతటి భారీ రాయితీలను ఏ రాష్ట్రమైనా భరించగలదా?" అని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఇంతలా పోటీ పడటంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.

ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తును సురక్షితం చేసే ఒక కీలక పెట్టుబడిని ప్రశ్నించడం సిగ్గుచేటని విమర్శించింది. "ప్రపంచస్థాయిలో పోటీపడే ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కర్ణాటక వెనుకబడిపోతుందనే విషయాన్ని మంత్రి ఖర్గే గ్రహించాలి. బెంగళూరు మౌలిక సదుపాయాల సమస్యలతో సతమతమవుతుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత అయిన 'భారత్ ఏఐ శక్తి'ని సాకారం చేస్తోంది" అని ఏపీ బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ హబ్‌ను నిర్మిస్తున్నామని, ఇది రాష్ట్రానికే కాకుండా మొత్తం 'డిజిటల్ ఇండియా'కు లభించిన విజయమని బీజేపీ అభివర్ణించింది. ఈ వివాదంతో టెక్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాల మధ్య ఉన్న తీవ్రమైన పోటీ మరోసారి బహిర్గతమైంది.


More Telugu News