24 గంటల్లో రెండోసారి.. అసోంలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి

  • గ్రనేడ్ల దాడిలో ముగ్గురు సైనికులకు గాయాలు
  • ఉల్ఫా-ఐ పనేనని బలమైన అనుమానాలు
  • ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులని భావిస్తున్న అధికారులు
  • అప్రమత్తమైన భద్రతా బలగాలు
ఈశాన్య రాష్ట్రం అసోంలో ఉద్రిక్తత నెలకొంది. భారత సైనిక స్థావరం లక్ష్యంగా ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. 24 గంటల వ్యవధిలోనే ఇది రెండో దాడి కావడం ఆందోళన కలిగిస్తోంది. టిన్‌సుకియా జిల్లాలోని కకోపథార్ పట్టణంలో ఉన్న 19 గ్రెనేడియర్స్ యూనిట్‌కు చెందిన ఆర్మీ క్యాంప్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.

గుర్తుతెలియని దుండగులు క్యాంప్‌పైకి గ్రెనేడ్లు విసిరి, కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కథనాల ప్రకారం అర్ధరాత్రి 12:15 గంటల ప్రాంతంలో మొదలైన కాల్పులు దాదాపు అరగంట పాటు కొనసాగినట్లు తెలుస్తోంది.

ఈ దాడి వెనుక యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ) హస్తం ఉన్నట్లు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. గురువారం అరుణాచల్ ప్రదేశ్‌లోని మన్‌మావ్‌లో అస్సోం రైఫిల్స్ దళాలపై ఉల్ఫా-ఐ తిరుగుబాటుదారులు మెరుపుదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన 24 గంటలు కూడా గడవకముందే మరో దాడి జరగడం గమనార్హం.

ఈ ఏడాది జులైలో మయన్మార్‌లోని సగాయింగ్ రీజియన్‌లో ఉన్న ఉల్ఫా-ఐ శిబిరంపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వరుస దాడుల నేపథ్యంలో అసోం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


More Telugu News