భార్యపై కోపంతో అత్తింటికి నిప్పుపెట్టి పరారైన అల్లుడు

  • కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలంలో ఘటన
  • తొమ్మిది నెలల క్రితం షమాబీ, ముజాహిద్ బేగ్‌లకు వివాహం
  • భర్త గొడవ పడటంతో 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన షమాబీ
  • అత్తింటిలో ముజాహిద్ గ్యాస్ సిలెండర్ పైపు లీక్ చేసి నిప్పుపెట్టిన వైనం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భార్యపై కోపంతో అత్తింటికి నిప్పు పెట్టి అల్లుడు పరారైన ఉదంతమిది. ఈ ఘటన కుమురంభీం జిల్లా లింగాపూర్ మండలంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. ఎల్లాపాటార్‌కు చెందిన షమాబీకి జైసూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. అయితే తనకు, పెళ్లి ఇష్టం లేదంటూ షమాబీతో ముజాహిద్ తరచుగా గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో షమాబీ 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. 

నిన్న ఎల్లాపాటార్‌లో ఉన్న భార్య షమాబీ వద్దకు ముజాహిద్ బేగ్ వెళ్లి గొడవ పడ్డాడు. ఆమెపై తీవ్ర కోపంతో అత్తింటిలోకి వెళ్లి గ్యాస్ సిలెండర్ పైపు లీక్ చేసి నిప్పంటించి అక్కడి నుంచి ముజాహిద్ పరారయ్యాడు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని వస్తువులు బుగ్గి పాలయ్యాయి.  

ఈ ఘటనపై లింగాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   


More Telugu News