ఆ కసి ఇంకా చావలేదు.. 2027 కప్ గెలిచేదాకా రోహిత్ ఆగడు: డీకే

  • 2027 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ చాలా కీలకమ‌న్న దినేశ్‌ కార్తీక్
  • వన్డే ప్రపంచకప్ గెలవాలనే కసి రోహిత్‌లో ఇంకా ఉంద‌ని వ్యాఖ్య‌
  • 2023 కప్ తర్వాత వెయ్యికి పైగా పరుగులు చేసిన హిట్‌మ్యాన్
  • జట్టు కోసం నిస్వార్థంగా ఆడుతున్నాడన్న మాజీ వికెట్ కీపర్
  • పవర్‌ప్లేలో రోహిత్ దూకుడు జట్టుకు అతిపెద్ద బలమ‌న్న డీకే
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 38 ఏళ్లు కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే చర్చ జరుగుతోంది. మరో రెండేళ్లలో రానున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో అతను ఆడతాడా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ పాత్ర అత్యంత కీలకమని, భారత జట్టుకు అతను చాలా అవసరమని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

'క్రిక్‌బజ్' తో మాట్లాడుతూ దినేశ్‌ కార్తీక్ ఈ విషయంపై స్పందించాడు. "2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత, వన్డే కప్ గెలవాలనే కసి రోహిత్‌లో ఇంకా బలంగా ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచి కెప్టెన్‌గా తన కలను నెరవేర్చుకున్నా, 50 ఓవర్ల కప్ గెలవాలనే కోరిక అతనిలో ఇప్పటికీ మండుతూనే ఉంది" అని కార్తీక్ వివరించాడు.

రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్‌ను కార్తీక్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. "2023 ప్రపంచకప్ తర్వాత రోహిత్ గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అతను 48 సగటుతో వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ గురించి మనందరికీ తెలిసిందే. రాబోయే 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుంటే, బ్యాటర్‌గా రోహిత్ జట్టుకు చాలా ముఖ్యం. అతను పూర్తి మనసు పెట్టి ఆడితే, కచ్చితంగా ఆ టోర్నీలోనూ రాణిస్తాడనే నమ్మకం నాకుంది" అని డీకే పేర్కొన్నాడు.

పవర్‌ప్లేలో రోహిత్ ఆడే దూకుడైన ఆట జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. "రోహిత్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతని బ్యాటింగ్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలర్లపై నిర్భయంగా దాడి చేసి, మిగతా బ్యాటర్లకు బలమైన పునాది వేస్తాడు. అతను ఇప్పుడు వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడటం లేదు, జట్టు కోసం ఆడుతున్నాడు. అతని నిస్వార్థ వైఖరి జట్టుకు ఎంతో స్ఫూర్తినిస్తోంది" అని దినేశ్‌ కార్తీక్ కొనియాడాడు.


More Telugu News