బీహార్‌లో బీజేపీ రెండో జాబితా విడుదల.. సింగర్ మైథిలీకి టిక్కెట్

  • 12 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల
  • అలీ నగర్ నుండి పోటీ చేయనున్న మైథిలీ ఠాకూర్
  • బక్సర్ నుండి బరిలోకి దిగుతున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ప్రముఖ గాయకురాలు మైథిలీ ఠాకూర్ అలీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా బక్సర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు బీజేపీ 12 మంది అభ్యర్థుల పేర్లను, వారు పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించింది.

బీహార్‌లోని మధుబని జిల్లా, బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. ఒకవేళ అవకాశం వస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మైథిలీ గతంలోనే తెలిపారు. ఆమెను ఎన్నికల కమిషన్ ఇదివరకే బీహార్ స్టేట్ ఐకాన్‌గా నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక రాయబారిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

బీజేపీ మొత్తం 101 స్థానాలకు గాను ఇప్పటివరకు 83 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం 71 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.


More Telugu News