విజయ్ కరూర్ ప్రచార సభలో తొక్కిసలాట.. అసెంబ్లీలో స్పందించిన ముఖ్యమంత్రి

  • ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమన్న స్టాలిన్
  • ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కలిచివేసిందన్న ముఖ్యమంత్రి
  • టీవీకే కార్యకర్తలు రెండు అంబులెన్సులపై దాడి చేశారన్న స్టాలిన్
సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్ ప్రచార సభలో తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. ఈ ఘటనపై తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని అన్నారు. ఈ దుర్ఘటన యావత్ రాష్ట్రాన్ని కలిచివేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు.

టీవీకే పార్టీ షెడ్యూల్ తప్పిదాలే ఈ ఘటనకు కారణమని స్టాలిన్ అన్నారు. విజయ్ ర్యాలీకి మధ్యాహ్నం వస్తారని పార్టీ ప్రకటించిందని, దీంతో ఎక్కువ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారని, కానీ ఆయన రాత్రి ఏడు గంటలకు వచ్చారని స్టాలిన్ గుర్తు చేశారు. ప్రచార వాహనం జనంలోకి వెళుతుండగా గందరగోళం నెలకొందని, ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రచార సభ సందర్భంగా టీవీకే పలు తప్పిదాలు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ ఆలస్యంగా రావడంతో పాటు కొందరు జనరేటర్ ఉన్న గదిలోకి ప్రవేశించి దానిని నిలిపివేశారని అన్నారు. తాగునీటితో సహా సరైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో టీవీకే విఫలమైందని ఆరోపించారు. గాయపడిన వారికి సహాయం చేసేందుకు సిబ్బంది ప్రయత్నించగా టీవీకే కార్యకర్తలు రెండు అంబులెన్సులపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడులకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని స్టాలిన్ గుర్తు చేశారు. అసలు, విజయ్ ప్రచార ర్యాలీకి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రతిపక్షాలు సభలో నిలదీశాయి.


More Telugu News