Rao Balasaraswathi Devi: రావు బాలసరస్వతి గారి మృతి పట్ల రేవంత్, బాలకృష్ణ ఆవేదన

Rao Balasaraswathi Devi Death Revanth Balakrishna Condolences
  • తొలితరం గాయని రావు బాలసరస్వతి మృతి
  • సినీ పరిశ్రమకు తీరని లోటు అన్న రేవంత్ రెడ్డి
  • తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయారన్న బాలకృష్ణ
తెలుగు చలనచిత్ర రంగంలో తొలి తరం నేపథ్య గాయనిగా చరిత్ర సృష్టించిన రావు బాలసరస్వతి దేవి గారి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ నటుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన చెందారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

బాలకృష్ణ స్పందిస్తూ... ప్రముఖ తెలుగు సినిమా గాయకురాలు, నటి రావు బాలసరస్వతి దేవి (97) అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "బాల సరస్వతి దేవి చిన్ననాటి నుండే కళారంగంలో ప్రవేశించి 1930ల నుండి 1960ల వరకు తెలుగు, తమిళ సినిమాల్లో గాయనిగా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళ సినిమాల్లో భక్త కుచేల, బాలయోగిని, తుకారాం వంటి చిత్రాల్లో చిన్నప్పుడే నటించారు. తెలుగు సినిమాల్లో మొదటి ప్లేబ్యాక్ సింగర్‌గా భాగ్యలక్ష్మి చిత్రంలో "థిన్నే మీద సిన్నోడ" పాటకు స్వరం ఇచ్చి చరిత్ర సృష్టించారు. తెలుగులో షావుకారు, పిచ్చి పుల్లయ్య వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడి తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆల్ ఇండియా రేడియోలో మొదటి 'లైట్ మ్యూజిక్' గాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. 2 వేలకుపైగా పాటలు పాడి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయారు. బాలసరస్వతీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
Rao Balasaraswathi Devi
Revanth Reddy
Balakrishna
Telugu cinema
playback singer
Telugu film industry
obituary
Tollywood
Bhagyalakshmi movie
light music

More Telugu News