Margani Bharat: డేటా సెంటర్ అంటే ఏమిటో లోకేశ్ కు తెలుసా?: మార్గాని భరత్

Margani Bharat criticizes Nara Lokesh on data center knowledge
  • నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
  • డేటా సెంటర్‌పై మాజీ మంత్రి అమర్‌నాథ్‌తో చర్చకు లోకేశ్ సిద్ధమా అని సవాల్
  • వైసీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేశామన్న భరత్
రాష్ట్రంలో కలకలం రేపుతున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణపై తమకు నమ్మకం లేదని, వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ పోలీసు కస్టడీ తర్వాత మాట మార్చాడని భరత్ ఆరోపించారు. ఈ నెల 6వ తేదీన విడుదల చేసిన వీడియోలో ఎవరి పేరూ చెప్పని నిందితుడు, కస్టడీ అనంతరం జోగి రమేశ్ పేరు చెప్పడం వెనుక కుట్ర ఉందని అన్నారు. మూడు నెలలుగా ఈ దందా కొనసాగుతోందని ఐపీఎస్ అధికారులే చెబుతున్నారని, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, అనకాపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం బయటపడిందని ఆయన గుర్తుచేశారు.

అదే సమయంలో, మంత్రి నారా లోకేశ్ తీరుపై కూడా భరత్ విమర్శలు గుప్పించారు. "డేటా సెంటర్ అంటే ఏమిటో లోకేశ్ కు తెలుసా?" అని ప్రశ్నించిన ఆయన, ఈ అంశంపై మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో బహిరంగ చర్చకు లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అప్పటి మంత్రి అమర్‌నాథ్‌ను ఉద్దేశించి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారని, వాస్తవానికి అభివృద్ధి అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగిందని భరత్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జగన్ 9 హార్బర్లకు శ్రీకారం చుట్టారని, అభివృద్ధి వికేంద్రీకరణ, పోర్టుల అభివృద్ధి వంటివన్నీ ఆయన ఆలోచనలేనని స్పష్టం చేశారు. జిందాల్ లాంటి సంస్థను రాష్ట్రం నుంచి తరిమివేయడం వల్లే ఆ సంస్థ మహారాష్ట్రలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని, అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామని, ఇది వాస్తవమని ఈ సందర్భంగా మార్గాని భరత్ అన్నారు. 
Margani Bharat
Fake liquor case
Andhra Pradesh
Nara Lokesh
Jogi Ramesh
Gudivada Amarnath
YS Rajasekhara Reddy
Jagan Mohan Reddy
TDP
YSRCP

More Telugu News