Sridhar Vembu: సామాజిక మాధ్యమం నుంచి 'జోహో' వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు విరామం

Sridhar Vembu Taking Break From Social Media
  • కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • వారం తర్వాత బ్రేక్ తీసుకున్నట్లు వెల్లడి
  • ఇక నుంచి తాను ఆచరించే వాటినే చెప్పాలనుకుంటున్నానన్న శ్రీధర్ వెంబు
సామాజిక మాధ్యమాల నుంచి కొంత విరామం తీసుకోనున్నట్లు 'జోహో' వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీధర్ వెంబు ప్రకటించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇతర బహిరంగ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటానని ఆయన తెలిపారు. ఈ వారం తరువాత విరామం ప్రారంభమవుతుందని, కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

ఇకపై తాను ఆచరించే విషయాల గురించే మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు. 'ఎక్స్'లో చురుగ్గా ఉండే ఆయన ఆ వేదికగానే ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా, వాట్సాప్‌కు పోటీగా జోహో రూపొందించిన స్వదేశీ యాప్ 'ఆరట్టై'కి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు సందేశాలు, వాయిస్ మరియు వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే సమావేశాల్లో పాల్గొనడం, స్టోరీలు, ఫొటోలు, డాక్యుమెంట్లు పంచుకోవడం వంటివి చేయవచ్చు. 'పాకెట్స్' అనే ప్రత్యేక ఫీచర్ ద్వారా సమాచారాన్ని భద్రపరుచుకోవచ్చు. తక్కువ ఇంటర్నెట్ వేగంతోనూ ఈ యాప్ పనిచేస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికి పిలుపునివ్వడంతో కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఆరట్టైని ఉపయోగిస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఆరట్టై వాడుతున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు బదులుగా జోహోతోనే కేబినెట్ ప్రజెంటేషన్‌ను రూపొందించినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, జీమెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌కు పోటీగా జోహో మెయిల్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇటీవల జోహో మెయిల్‌కు మారుతున్నట్లు ప్రకటించారు.
Sridhar Vembu
Zoho
Arattai
Social Media Break
Indian App
Dharmendra Pradhan

More Telugu News